

కొలంబో వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌లో భారత్–పాకిస్తాన్ తలపడ్డాయి. నిన్న జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్టేడియంలో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇండియా–పాక్ మ్యాచ్‌ను వీక్షించేందుకు నారా లోకేష్ తన స్నేహితులు, తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి కొలంబోకు వెళ్లినట్లు సమాచారం. స్టేడియంలో ఆయన భారత జెర్సీ ధరించి, తన పేరుతో ఉన్న జెర్సీతో పాటు జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ జట్టుకు మద్దతు తెలిపారు. ఈ ఫోటోలు, వీడియోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. కోట్లాది అభిమానులు ఎదురుచూసే ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
భారత్ విజయం అనంతరం కూడా నారా లోకేష్ ప్రత్యేకంగా స్పందించారు. జట్టుకు అభినందనలు తెలుపుతూ, ఓపెనర్ ఇషాన్ కిషన్ 77 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినట్లు ప్రశంసించారు. అతని నిర్భయమైన బ్యాటింగ్ ఈ విజయానికి కీలకమైందని పేర్కొన్నారు. అలాగే భారత బౌలర్ల ప్రదర్శనను కూడా కొనియాడారు. ఈ విజయం దేశ గౌరవాన్ని మరింత పెంచిందని, ఇదే ఉత్సాహంతో టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇషాన్ కిషన్ తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, పాకిస్తాన్‌పై ఈ ఘన విజయం సాధించిన భారత్ సూపర్ 8 దశకు కూడా అర్హత సాధించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!