

భారత టెన్నిస్‌లో యువ క్రీడాకారిణి జెన్సీ కనాబర్ అరుదైన ఘనత సాధించింది. ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ ఫైనల్‌కు చేరిన అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. గుజరాత్‌కు చెందిన 14 ఏళ్ల 11 నెలల జెన్సీ.. ఐటీఎఫ్ డబ్ల్యూ-15 టోర్నీలో భాగంగా జరిగిన సెమీఫైనల్లో నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్లోరెంటీన్ డికెర్స్‌పై 6-1, 6-0తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆమె ఫైనల్‌లోకి అడుగుపెట్టి భారత టెన్నిస్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
ఇంతకుముందు ఈ రికార్డు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరిట ఉండేది. 2002లో హైదరాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ సింగిల్స్ టోర్నీలో సానియా 15 ఏళ్ల 10 నెలల వయసులో ఫైనల్‌కు చేరింది. తాజాగా జెన్సీ 14 ఏళ్ల 11 నెలలకే ఆ ఘనత సాధించి సానియా రికార్డును అధిగమించింది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి టోర్నీలో చూపిన ఈ ప్రతిభతో భారత టెన్నిస్‌లో జెన్సీ పేరు మార్మోగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!