

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామ పంచాయతీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదివారం పర్యటించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లతో నేరుగా మాట్లాడి ఓటింగ్ ప్రక్రియ, కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలు, ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఫిర్యాదులు లేదా సమస్యలు లేవని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో స్వల్ప ఘర్షణలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు సమాచారం అందిందని పునేఠా వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసు శాఖ అదనపు బలగాలను పంపించిందని తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత తిరిగి పోలింగ్ నిర్వహించేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను అదే రోజు సాయంత్రం లేదా రాత్రిలోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అనంతరం నంబూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించి, సిబ్బంది నియామకం, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!