

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై రోజుకో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వస్తోంది. గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్, టైమ్ ట్రావెల్ అంశాలతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో మహేశ్ బాబు పోషిస్తున్న రుద్రుడి పాత్రకు, రామాయణంలోని శ్రీరాముడి ఘట్టానికి కీలకమైన సంబంధం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో సుమారు 25 నిమిషాల పాటు సాగే శ్రీరాముడి ఎపిసోడ్ ఉండనుందని, అది కేవలం పౌరాణిక ఘట్టంగా కాకుండా రుద్రుడి టైమ్ ట్రావెల్ కథతో ముడిపడి ఉంటుందని సమాచారం. రామాయణ యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు కూడా కథలో కీలకంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇటీవల రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిన నేపథ్యంలో ‘వారణాసి’లోనూ రామాయణ ఘట్టం ఉంటుందన్న ప్రచారం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్, టైమ్ ట్రావెల్, రామాయణ యుద్ధం వంటి విభిన్న అంశాలను రాజమౌళి ఒకే కథలో ఎలా మిళితం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యం కారణంగా 2027 ఏప్రిల్‌లో అనుకున్న విడుదల తేదీ మారవచ్చంటూ కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపైనా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాత్రల పరిచయాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!