

భారత మహిళా జట్టు మూడో టీ20లోనూ శ్రీలంకపై ఆధిపత్యం చూపుతూ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుక్రవారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌తో, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13.2 ఓవర్లలోనే 115/2 చేసి సులువుగా విజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 42 బంతుల్లో 79 పరుగులతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మలిచింది. జెమిమా రోడ్రిగ్స్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు తడబడటంతో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులే చేయగలిగింది. విష్మి గుణరత్నే 32 పరుగులతో శ్రీలంక తరఫున టాప్ స్కోరర్‌గా నిలవగా, చమరి ఆటపట్టు 18, హర్షిత సమరవిక్రమ 15 పరుగులు చేశారు. రేణుక సింగ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ 3 వికెట్లతో అద్భుతంగా రాణించింది. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో శ్రీలంక భారీ స్కోరు సాధించలేకపోయింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ సిరీస్ విన్ కాగా, నాలుగో టీ20 ఈనెల 28న, ఐదో టీ20 ఈనెల 30న జరగనున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!