

జోరుమీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు మరో విజయానికి సిద్ధమైంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం విశాఖపట్నంలో జరిగే రెండో టీ20లో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు ను భారత్ ఢీ కొంటుంది. తొలి టీ20లో శ్రీలంకను 121/6కు కట్టడి చేసిన భారత్, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అయితే తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్, ముఖ్యంగా క్యాచింగ్‌లో తడబడింది. మొత్తం అయిదు క్యాచ్‌లు చేజార్చడంతో ఈ అంశంపై జట్టు ప్రత్యేక దృష్టి పెట్టింది. ‘‘మా ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకోవడంపైనే ఫోకస్ చేస్తున్నాం. ఎందుకు క్యాచ్‌లు చేజారుతున్నాయో తెలుసుకుని, వచ్చే మ్యాచ్‌లో మెరుగ్గా ఆడతాం’’ అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. ప్రపంచకప్ తర్వాత ఆరు వారాల విరామం రావడంతో ఫీల్డింగ్‌లో లయ అందుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశముందని టీమ్ భావిస్తోంది.
బ్యాటింగ్ పరంగా భారత్ బలంగా కనిపిస్తోంది. జెమీమా రోడ్రిగ్స్ తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించగా, అదే జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ షెఫాలి వర్మకు ఈ సిరీస్ కీలకం కాగా, స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మలతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి ఆకట్టుకుంది. దీప్తి శర్మ, శ్రీచరణిలతో కలిసి స్పిన్ భారం మోయనుంది. అరుంధతి రెడ్డి, అమన్‌జ్యోత్ కౌర్ పేస్ బాధ్యతలు చూసుకుంటారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు ఉండే అవకాశాలు తక్కువే. వరుస విజయాలతో ఆత్మవిశ్వాసం నిండిన భారత్‌ను అడ్డుకోవడం చమరి అథపత్తు నేతృత్వంలోని శ్రీలంకకు కఠిన సవాలే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!