

శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా.. రెండో టెస్టుకు సిద్ధమైంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆదివారం నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన శుభ్‌మన్ గిల్ బృందం.. రెండో మ్యాచ్‌లోనూ ఆధిపత్యం కొనసాగించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. 2023 జులైలో వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచిన తర్వాత విదేశీ గడ్డపై భారత్‌కు టెస్టు సిరీస్ విజయం దక్కలేదు. దీంతో కొలంబో విజయం గిల్ సేనకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
తొలి టెస్టులో భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమష్టిగా రాణించాయి. దేవదత్ పడిక్కల్ అద్భుతమైన 167 పరుగులతో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేయగా.. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ కూడా కీలక పరుగులు చేశారు. అయితే కొలంబోలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లను జట్టు ఆశిస్తోంది. ముఖ్యంగా ఎడమచేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో తన బలహీనతను అధిగమించేందుకు గిల్ ప్రత్యేకంగా సాధన చేశాడు. తొలి టెస్టులో 10 వికెట్లు తీసిన మానవ్ సుతార్, రవీంద్ర జడేజా మరోసారి ప్రభావం చూపాలని భారత్ కోరుకుంటోంది.
మరోవైపు తొలి టెస్టులో ఓటమిపాలైన శ్రీలంక.. సొంతగడ్డపై సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. భారత బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే ఆ జట్టు టాప్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అయితే కీలక బ్యాటర్లు కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్ రెండో టెస్టుకు దూరమయ్యారు. పాథుమ్ నిస్సాంక కూడా అందుబాటులో లేకపోవడం లంకకు మరింత ప్రతికూలంగా మారింది.
గాలెతో పోలిస్తే కొలంబో పిచ్ బ్యాటింగ్‌కు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా సహకారం లభించవచ్చని అంచనా. తొలి టెస్టులో ఆధిక్యం సాధించిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుండగా.. శ్రీలంక మాత్రం సిరీస్ సమం చేసేందుకు చివరి ప్రయత్నం చేయనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!