

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసినా.. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోడీ చారిత్రక కాంస్య పతకాన్ని అందుకుంది. 15 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు పతకం ఖాయం చేసిన ఈ జంట.. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ చైనా జోడీ షెంగ్ షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21తో ఓటమిపాలైంది. ఫైనల్‌కు చేరలేకపోయినా.. అంచనాలను మించి రాణించి భారత్‌కు పతకాన్ని అందించింది.
తొలి గేమ్‌లో గాయత్రి-ట్రీసా జోడీ 7-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. చైనా జంట పుంజుకున్నప్పటికీ భారత ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి 21-18తో గేమ్‌ను గెలుచుకున్నారు. రెండో గేమ్‌లో విరామ సమయానికి 11-10తో భారత్ ముందంజలో ఉన్నా.. ఆ తర్వాత నెట్ దగ్గర చేసిన తప్పిదాలు చైనా జోడీకి కలిసొచ్చాయి. మూడో గేమ్‌లోనూ భారత జంట పుంజుకోలేకపోవడంతో 8-21తో గేమ్‌ను కోల్పోయింది. ఓటమితో కాంస్యంతో సరిపెట్టుకున్నప్పటికీ.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో పతకం సాధించిన రెండో భారత జోడీగా గాయత్రి-ట్రీసా చరిత్ర సృష్టించారు. 2011లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప కాంస్యం సాధించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!