

ఆరు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, పదునైన వేగంతో బంతులు సంధించే పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా మారుతున్నాడు. 26 ఏళ్ల ఈ బౌలర్ షార్ట్‌పిచ్ బంతులను సమర్థంగా సంధిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత బౌలింగ్ దళంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే గుర్నూర్ తన బౌలింగ్‌తో ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశాడు. తొలి రెండు మ్యాచుల్లో భారత పేసర్లు షార్ట్‌పిచ్ బంతులతో తొమ్మిది వికెట్లు పడగొట్టగా.. అందులో ఐదు గుర్నూర్ ఖాతాలోనే చేరడం విశేషం. తన బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడమే కాకుండా, మైదానంలో మాటలతోనూ వారిని కవ్విస్తూ తన దూకుడును ప్రదర్శిస్తున్నాడు.
అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గుర్నూర్‌కు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపై ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నాడు. అతడిలోని ప్రతిభను తొలుత గుర్తించింది భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్. కూచ్ బెహార్ షీల్డ్ మ్యాచ్‌ను వీక్షించిన సమయంలో గుర్నూర్ బౌలింగ్‌ను గమనించిన గిల్.. మొహాలీ జిల్లా జట్టులో అవకాశం దక్కేందుకు సహకరించాడు. ఆ తర్వాత పంజాబ్ అండర్-23 జట్టుకు ఎంపికైన గుర్నూర్ దేశవాళీ క్రికెట్‌లో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆమోదంతో జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్‌ను ఆదర్శంగా భావించే గుర్నూర్.. చిన్నప్పటి నుంచే ఫాస్ట్ బౌలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అతడి ఎత్తును చూసి తండ్రి బాస్కెట్‌బాల్ వైపు వెళ్లాలని భావించినప్పటికీ, గుర్నూర్ మాత్రం క్రికెట్‌నే ఎంచుకున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!