

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ చైనా గూఢచర్యానికి సంబంధించిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బిలియనీర్ ఎలాన్ మస్క్ గతంలో చేసిన ఓ వ్యాఖ్య మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2025 అక్టోబర్‌లో మస్క్ చేసినట్లు ప్రచారంలో ఉన్న ఈ వ్యాఖ్యలో “ఆమెకు అందంలో పదికి పది మార్కులు వేస్తే.. నువ్వు ఆమెకు ఓ ఆస్తిగా మారుతావు” అని పేర్కొన్నట్లు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అందంగా కనిపించే వ్యక్తుల పట్ల ఆకర్షితులయ్యే ముందు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికగా ఈ వ్యాఖ్యను కొందరు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కీలక సాంకేతిక సమాచారం, వ్యాపార రహస్యాలకు సంబంధించిన వివరాలు తెలిసిన వ్యక్తులు వ్యక్తిగత సంబంధాల ద్వారా లక్ష్యంగా మారే ప్రమాదం ఉందనే కోణంలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇక్కడ ‘10’ అంటే అందంలో పదికి పది మార్కులు కాగా, ‘ఆస్తి’ (Asset) అంటే గూఢచర్య సంస్థలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోగల వ్యక్తి అని అర్థం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, 2025లో బ్రిటన్‌కు చెందిన ఓ పత్రిక ప్రచురించిన కథనం కూడా అప్పట్లో టెక్నాలజీ రంగంలో చర్చకు దారితీసింది. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న టెక్నాలజీ నిపుణులను చైనా, రష్యా గూఢచార సంస్థలు వ్యక్తిగత సంబంధాల ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నాయనే ఆరోపణలను ఆ కథనం ప్రస్తావించింది. ప్రేమ, స్నేహం, పరిచయం, వివాహం వంటి సంబంధాలను ఉపయోగించుకుని కీలక సాంకేతిక సమాచారం, వ్యాపార రహస్యాలను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. తాజా ఎన్విడియా వివాదం నేపథ్యంలో మస్క్ పాత వ్యాఖ్య మళ్లీ చర్చకు రావడంతో ఈ అంశంపై ఆసక్తి పెరిగింది. అయితే, ఇవి ఆరోపణలు, వ్యాఖ్యలపై సాగుతున్న విశ్లేషణలు మాత్రమేనని, జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన గూఢచర్య కార్యకలాపాలకు ఇవి ప్రత్యక్ష ఆధారాలు కావని గమనించాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!