

ఆసియా క్రీడల్లో కురాష్ విభాగంలో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల 78 కేజీల విభాగంలో పింకి బల్హారా కాంస్య పతకం సాధించింది. ప్రిక్వార్టర్‌ఫైనల్లో బై పొందిన పింకి.. క్వార్టర్‌ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్‌ను 3-0తో ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆమెకు పతకం ఖాయమైంది. అయితే సెమీఫైనల్లో మరో కొరియా క్రీడాకారిణి సుమిన్ మో చేతిలో 0-5తో ఓడటంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో పింకి బల్హారాకు ఇది రెండో పతకం. 2018 ఆసియా క్రీడల్లో 52 కేజీల విభాగంలోనూ ఆమె కాంస్యం గెలిచింది.
దిల్లీకి చెందిన పింకి బల్హారా తొమ్మిదేళ్ల వయసులో జూడో నేర్చుకోవడం ప్రారంభించింది. మామయ్య ప్రోత్సాహంతో ఆ తర్వాత కురాష్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్‌ఫైనల్ సందర్భంగా మోకాలికి గాయమైందని, సెమీఫైనల్‌లో ప్రత్యర్థి ఆ గాయాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని పింకి వెల్లడించింది. కురాష్ ఒక మార్షల్ ఆర్ట్స్ క్రీడ. ఇది చూడటానికి రెజ్లింగ్‌ను పోలి ఉన్నప్పటికీ.. పోటీదారులు నిలబడే పోరాడాలి, లెగ్ అటాక్‌కు అనుమతి ఉండదు. ప్రత్యర్థిని కిందపడేయడం ద్వారా పాయింట్లు సాధిస్తారు. ప్రత్యర్థి వెన్ను నేలకు తగిలితే విజయం దక్కుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!