

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తెలంగాణలో భూగర్భ జలాల పరిస్థితిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల శాఖ అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో పాడి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఈఎన్‌సీ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, భూగర్భ జలాల శాఖ డైరెక్టర్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. భూగర్భ జలాల నిపుణుడు, సీఎస్‌ఐఆర్–ఎన్‌ఈఐఎస్‌టీ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వీరేంద్ర ఎం. తివారీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి, దానిని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థిక సాయం కోరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ప్రధానిని కలవనున్నట్లు వెల్లడించారు. భూగర్భ జలమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నీటిమట్టాలు తగ్గుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రధానితో జరిగే భేటీలో ప్రస్తావించేందుకు జల సంరక్షణ చర్యలపై అధికారులు తమ సూచనలు అందించాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!