

తెలంగాణలో భావితరాల అవసరాలకు అనుగుణంగా, సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. భారత్ సమ్మిట్-2026లో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ‘ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్’ చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషించాయని, మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే లక్ష్య సాధనలో ఈ నగరం కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ఇది కేవలం పారిశ్రామిక ప్రాంతంగా కాకుండా నివాసం, ఉపాధి, విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వివరించారు.
నెట్‌జీరో లక్ష్యంతో పర్యావరణహితంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, సౌర విద్యుత్, పచ్చదనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఏఐ, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, అంతరిక్ష సాంకేతికత, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. అమెజాన్, హైపర్‌వాల్ట్, కంట్రోల్ ఎస్, మారుబెనీ, సెమ్‌కార్ప్, ఎన్‌టీటీ వంటి ప్రముఖ సంస్థలు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆహ్వానించిన ఆయన, భూమి కేటాయింపుల నుంచి మౌలిక సదుపాయాలు, అనుమతుల వరకు అన్ని దశల్లో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!