

బిగ్‌బాస్ తమిళ్ 10లో హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రాజకీయ చర్చకు దారితీశాయి. గత వారం కెప్టెన్సీ పోటీలో గెలిచిన సతిగా.. హౌస్‌మేట్స్‌కు పలు హామీలు ఇచ్చింది. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని పూర్తిగా అమలు చేయలేకపోయింది. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లో విజయ్ సేతుపతి ఆమె తీరును ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం, బాధ్యతలు స్వీకరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలవడం నాయకుడి లక్షణాలని అన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదని, ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఏ రాజకీయ పార్టీ లేదా నాయకుడి పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించినవేనంటూ కొందరు సోషల్ మీడియా వేదికల్లో చర్చ మొదలుపెట్టారు.
దీంతో విజయ్ అభిమానులు, విజయ్ సేతుపతి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం నేపథ్యంలో కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయ్ టీవీ స్పందించింది. బిగ్‌బాస్ తమిళ్ 10 అనేది షో ఫార్మాట్, థీమ్స్, గేమ్ వాతావరణానికి అనుగుణంగా రూపొందించిన వినోద కార్యక్రమమని స్పష్టం చేసింది. కార్యక్రమంలో చోటుచేసుకునే పరిస్థితులు, డైలాగ్స్, అభిప్రాయాలను షోలో భాగంగానే చూడాలని పేర్కొంది. కార్యక్రమంలో వ్యక్తమయ్యే వ్యాఖ్యలకు బయట ఉన్న ఏ వ్యక్తి, సంస్థ లేదా వ్యవస్థతోనూ సంబంధం లేదని ఛానల్ స్పష్టం చేసింది. దీంతో విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై కొనసాగుతున్న చర్చకు ముగింపు పలికే ప్రయత్నం చేసింది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!