

సజ్జలపై విజయసాయిరెడ్డి ఆరోపణలు: వైఎస్సార్‌సీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సజ్జల వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. తనను ‘నమ్మకద్రోహి’ అంటూ వైకాపా కోటరీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోందని పేర్కొంటూ శనివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను నిజంగా నమ్మకద్రోహినైతే గతంలోనే కాంగ్రెస్‌తో రాజీ చేసుకుని తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేవాడినని, కానీ జగన్‌పై నమ్మకంతోనే ఆయనతో పాటు ప్రతి ఛార్జిషీట్‌లో తన పేరు నమోదైందని తెలిపారు. సజ్జల తనను తాను నాస్తికుడిగా, కమ్యూనిస్టుగా చెప్పుకుంటూ జగన్ మెప్పు పొందేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పార్టీపై ఆయన ప్రభావం పెరిగిన తర్వాత జగన్‌కు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు దూరమయ్యారని విమర్శించారు.
ఆత్మగౌరవం కోసమే రాజీనామా: 2020 నుంచి పార్టీలో తన ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైఎస్ కుటుంబం కోసం దశాబ్దాల పాటు పనిచేసిన తనను ఢిల్లీ, పీఎంవో, పార్టీ వ్యవహారాల్లో అవమానించారని పేర్కొన్నారు. 2022 మంగళగిరి ప్లీనరీలో తనపై భౌతిక దాడి జరిగినా పార్టీ నాయకత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలతో పాటు పలు జిల్లా ఇన్‌ఛార్జ్ పదవులు, కోర్ కమిటీ బాధ్యతల నుంచి తనను తప్పించారని తెలిపారు. ఇలాంటి అవమానాలు మొత్తం 74 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. సజ్జల కింద పనిచేయడం తన ఆత్మగౌరవానికి విరుద్ధమని భావించి నాలుగేళ్ల రాజ్యసభ పదవీకాలాన్ని వదులుకుని, వైకాపా, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. జగన్‌కు తాను నమ్మకద్రోహం చేయలేదని, చేయబోనని స్పష్టం చేసిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతానని ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని విషయాలను మీడియా ద్వారా వెల్లడిస్తానని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!