

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు ఉన్న గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు శనివారం రాసిన లేఖలో.. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనందున ఓటర్ల జాబితా సవరణను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం సెప్టెంబరు 16 వరకు ఉన్న గడువును మరో నాలుగు వారాలు పొడిగించడంతో పాటు, అక్టోబరు 19న ప్రచురించాల్సిన తుది ఓటర్ల జాబితా తేదీని కూడా మార్చాలని కోరారు. 2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 73.39 లక్షల మందిని గైర్హాజరు, నివాసం మారిన, మృతి చెందిన, డూప్లికేట్ (ASDD) ఓటర్లుగా గుర్తించినట్లు లేఖలో పేర్కొన్నారు. డిజిటలైజ్ చేసిన ఎన్యూమరేషన్ పత్రాల్లోని లోపాలు, గత జాబితాతో అనుసంధానం కాని ఫారాల కారణంగా సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
SIR ప్రక్రియలో కొన్ని కీలక లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణించకూడదని సూచించారు. ఓటరు పేరు తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ (FRC)తో పాటు మండల స్థాయి అధికారులు జారీ చేసే గుర్తింపు పత్రాలను కూడా అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, పురపాలిక వార్డుల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పోలింగ్ కేంద్రాల స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం, అవసరమైన చోట అదనపు ఏఈఆర్వోలను నియమించడం ద్వారా ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకుండా, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. SIR ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!