

ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత మహిళల జట్టు.. తిరిగి జోరందుకోవడమే లక్ష్యంగా మహిళల టీ20 ఆసియాకప్‌కు సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఆదివారం గ్రూప్-ఎలో థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్ అయిదు టోర్నీల్లో భారత్ మూడుసార్లు టైటిల్ సాధించింది. అయితే ప్రస్తుత ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఆడిన 16 టీ20ల్లో భారత్ 9 మ్యాచ్‌ల్లో ఓడింది. టీ20 ప్రపంచకప్‌లోనూ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. వచ్చే నెలలో ఆసియా క్రీడలు ఉండటంతో ఈ టోర్నీలో ఫామ్, నిలకడను అందుకోవడం భారత జట్టుకు కీలకం.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్‌పైనా అందరి దృష్టి ఉంది. స్మృతి మంధాన, షెఫాలి వర్మతో భారత ఓపెనింగ్ విభాగం బలంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆ తర్వాతి బ్యాటర్లు అదే జోరును కొనసాగించాల్సి ఉంటుంది. ఫీల్డింగ్‌లోనూ మెరుగుదల అవసరం. స్పిన్ విభాగంలో తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మతో పాటు రాధ యాదవ్ ఉన్నారు. రేణుక సింగ్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, నందని శర్మలతో పేస్ బౌలింగ్ విభాగం కూడా పటిష్ఠంగా ఉంది. వీరిలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో ఆసక్తికరంగా మారింది. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం లేకపోవడంతో శుభారంభం చేసే అవకాశముంది. గ్రూప్-ఎలో భారత్, థాయ్‌లాండ్‌తో పాటు హాంకాంగ్, పాకిస్థాన్ ఉన్నాయి. వీటిలో పాకిస్థాన్ కాస్త గట్టి ప్రత్యర్థిగా కనిపిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!