

పాలమూరు కార్పొరేషన్ పరిధిలోని 53 వ డివిజన్లో విజయం చివరి వరకు ఉత్కంఠ రేపింది. కాంగ్రెస్ మరియు బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ క్షణక్షణం మారుతూ సాగింది. మొదటిసారి ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్ 816 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి రమేశ్‌కుమార్‌కు 815 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు మెజారిటీతో రాఘవేందర్ విజేతగా ప్రకటించారు.
అయితే బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్ కోరారు. తొలుత అధికారులు అంగీకరించకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఇద్దరు ప్రధాన అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మాత్రమే మళ్లీ లెక్కించారు. రెండోసారి లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లు 818 కు చేరగా, బీజేపీ అభ్యర్థి ఓట్లు 819 కు పెరిగాయి. ఈసారి ఒక్క ఓటు ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ముందంజలో నిలిచారు.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థి కూడా పూర్తి రీకౌంటింగ్ కోరారు. కేవలం ఇద్దరి ఓట్లు మాత్రమే కాకుండా, పోటీలో ఉన్న అన్ని అభ్యర్థుల ఓట్లను మళ్లీ లెక్కించాలని పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం ఇది చివరి లెక్కింపు అవుతుందని, వచ్చిన ఫలితాన్ని అందరూ అంగీకరించాలనే షరతుతో అధికారులు మూడోసారి కౌంటింగ్ నిర్వహించారు.
చివరి లెక్కింపులో బీజేపీ అభ్యర్థి రమేశ్‌కుమార్ 819 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్ 818 ఓట్లు సాధించారు. శుక్రవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. అనంతరం రమేశ్‌కుమార్ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!