

బిహార్‌లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాలు నీటమునిగాయి. వరదల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కఠిహార్ జిల్లాలోని రఘునాథ్‌పుర్‌కు చెందిన ఉపాధ్యాయుడు మహమ్మద్ సాహెబ్ వినూత్న ఆలోచన చేశారు. తల్లిదండ్రుల అనుమతితో ఓ పడవను మొబైల్ తరగతి గదిగా మార్చి, వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులను ప్రతిరోజూ పడవలోనే నీటి మట్టం తక్కువగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. తరగతులు పూర్తయ్యాక వారిని తిరిగి ఇళ్ల వద్ద సురక్షితంగా దింపుతున్నారు.
సాధారణ పాఠాలతో పాటు పడవలోనే విద్యార్థులకు వివిధ కోచింగ్ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు విద్యకు అడ్డంకిగా మారకూడనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహమ్మద్ సాహెబ్ తెలిపారు. ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులను పడవలోకి తీసుకురాకుండా విడతల వారీగా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి విపత్తు సమయంలోనూ విద్యను కొనసాగించేందుకు ఆయన చేసిన ఈ ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!