

రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేలా అమెరికా రూపొందించిన శాంక్షన్స్ బిల్లు కీలక దశకు చేరుకుంది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ను అమెరికా సెనెట్ ఇప్పటికే 86-11 ఓట్లతో ఆమోదించింది. ఈ బిల్లును ప్రతినిధుల సభ పరిశీలిస్తున్న నేపథ్యంలో.. భారత్ సహా రష్యా చమురు కొనుగోలు చేసే దేశాల పేర్లను నేరుగా చేర్చే సవరణను డెమోక్రటిక్ ప్రతినిధి స్టేనీ హోయర్ ప్రతిపాదించారు. ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, తుర్కియే, అజర్‌బైజాన్, హంగేరీ, స్లోవేకియా, యూఏఈ, సింగపూర్, కజకిస్థాన్, కిర్గిస్థాన్ ఉన్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధానికి ఆర్థికంగా ఒత్తిడి పెంచడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం కల్పించే నిబంధన ఇందులో ఉంది. అయితే ఈ విస్తృత టారిఫ్ అధికారాన్ని తొలగించాలని కొందరు డెమోక్రటిక్ సభ్యులు మరో సవరణను ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రతినిధుల సభలో బిల్లుపై చర్చలు, సవరణలు కొనసాగుతున్నందున.. భారత్ పేరు తుది చట్టంలో ఉంటుందా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. సభ ఆమోదం పొందిన తర్వాతే తదుపరి దశకు వెళ్లి, చివరికి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!