

బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు 22ఏ భూముల వ్యవహారంపై కీలక డిమాండ్లు చేశారు. 22ఏ విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తప్పు చేసినట్లు తేలితే ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధరణి, భూ భారతి వ్యవస్థల్లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎంతమందికి ఎన్ని ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయో, ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.
22ఏ అంశంపై రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి వేర్వేరుగా మాట్లాడారని రఘునందన్‌రావు విమర్శించారు. 22ఏ భూముల విషయంలో తప్పు చేసిన అధికారులను శిక్షించాలని కోరారు. సింఫనీ కాలనీలో రిజిస్ట్రేషన్లకు డబ్బులు తీసుకున్నారంటూ ఆయన ఆరోపించారు. 22ఏలో ఉందని పేర్కొన్న పావని కుటుంబానికి చెందిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాలేదని ప్రస్తావిస్తూ, అక్కడ సమస్య ఉందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక సమస్యపై మాట్లాడుతున్నంత మాత్రాన రెండు పార్టీలు ఒక్కటైనట్లు కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 43,440 ఎకరాలను 22ఏ కిందకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారని, ఆ భూములను 22ఏలో చేర్చిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
22ఏ కింద ఉన్న భూముల వివరాలను బహిరంగంగా ఎందుకు వెల్లడించడం లేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. 22ఏలో కోటి ఎకరాల భూమి ఎలా వచ్చిందో ప్రభుత్వం వివరించాలని అన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా తప్పులు జరిగాయని మంత్రి పొంగులేటి చెబుతున్న నేపథ్యంలో, ఆ తప్పులకు బాధ్యులు ఎవరు, వారిపై చర్యలు తీసుకుంటారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. 22ఏ వ్యవహారంలో పేదలకు జరిగిన నష్టానికి పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై అసెంబ్లీలో వాస్తవాలను వెల్లడించాలని కోరారు. తాను బీఆర్‌ఎస్ చట్టం కాదని, కాంగ్రెస్ శత్రువు కాదని వ్యాఖ్యానించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం దేశంలో అమలు అవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!