

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేసేలా తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, గ్యాస్ సదుపాయాలపై దాడులు నిలిపివేయడానికి ఇరుదేశాలు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈ ఒప్పందం గురించి తనకు ముందుగా సమాచారం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. మీడియా వార్తల ద్వారానే ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. ఈ ప్రతిపాదనను స్వాగతించిన ఆయన.. రష్యా తమ ఇంధన సదుపాయాలపై దాడులు నిలిపివేస్తే, తాము కూడా రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు ఆపేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అయితే, ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. రష్యా కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.
మరోవైపు, ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఉక్రెయిన్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు కొనసాగినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. రాజధాని కీవ్‌తో పాటు ఖర్కీవ్‌లోనూ దాడులు జరిగినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఖర్కీవ్‌లోని విద్యుత్ కేంద్రంపై దాడి జరిగినట్లు కూడా తెలిపారు. తాజా దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడినట్లు వార్తలు వెలువడ్డాయి. దాడులు కొనసాగితే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జెలెన్‌స్కీ హెచ్చరించారు. కాల్పుల విరమణపై స్పష్టత రావాలంటే రష్యా కూడా అంగీకరించి, దాడులను నిలిపివేయాల్సి ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!