
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు, మైనార్టీలు సహా అన్ని వర్గాలకు ఈ బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆమె, రైతుభరోసా, చేయూత పింఛన్లు వంటి పథకాల కోసం గత ఏడాది కేటాయించిన నిధులనే ఎలాంటి మార్పులు లేకుండా ఈసారి కూడా కొనసాగించారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి స్పష్టమైన దృష్టి లేదని, అందుకే దీనిని రివిజన్ బడ్జెట్‌గా పేర్కొంటున్నామని అన్నారు. ప్రతి ఏడాది బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా, బడ్జెట్‌లో కేవలం 4 శాతం నిధులు మాత్రమే కేటాయించడం ద్వారా బీసీలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు ఇంత తక్కువ నిధులు కేటాయించడం ఎలా న్యాయం అవుతుందో ప్రశ్నించారు.
అదేవిధంగా, భారీగా అప్పులు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ నిధులను ఎలా వినియోగిస్తున్నదో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రం దాదాపు రూ.8.64 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, దీనివల్ల ప్రతి వ్యక్తిపై సుమారు రూ.2.16 లక్షల భారం పడిందని ఆమె పేర్కొన్నారు. ఒక్కో కుటుంబంపై సుమారు రూ.9 లక్షల అప్పు భారం మోపబడిందని విమర్శించారు. ఇంత భారీగా అప్పులు తీసుకున్నప్పటికీ ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆమె ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనప్పటికీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక సహాయం ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని కవిత ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఒకరిని మించి ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం అని అభివర్ణిస్తూ ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు.

.jpeg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!