

సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను వారి నివాసాల్లోనే నిర్బంధించారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రికి బీఆర్ఎస్ నేతలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆస్పత్రిని సందర్శించాలనుకున్నామని హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆస్పత్రుల్లోని వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం హౌస్ అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని, ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ తరహాలో వ్యవహరిస్తోందని విమర్శించారు. మరోవైపు, సనత్‌నగర్, అమీర్‌పేట్ డివిజన్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా పోలీసులు ముందస్తుగా నిర్బంధించినట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!