

పశ్చిమాసియాలో ప్రస్తుతం భారీ స్థాయిలో దాడులు జరగకపోయినా.. యుద్ధ వాతావరణం మాత్రం కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లో టెహ్రాన్‌లో ఇరాన్ మహిళలకు సైనిక శిక్షణ ఇస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇమామ్ హుస్సేన్ స్క్వేర్‌లోని ఓ సైనిక కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో హ్యాండ్‌గన్ సహా ఆయుధాల ప్రాథమిక వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలను, చుట్టుపక్కల వారిని ఎలా రక్షించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ గట్టి స్పందన ఇస్తోంది. ఆంక్షలు, సైనిక బలప్రయోగం ద్వారా ఘర్షణలకు ముగింపు రాదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. న్యాయమైన, నిష్పక్షపాత చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగే అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశం పార్లమెంట్ అజెండాలో ఉందని ఎంపీ అలీరెజా సలిమీ వెల్లడించారు. అలాగే శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలు ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియా భద్రతపై మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!