

తమిళ హీరో శివకార్తికేయన్ తాజాగా నిర్వహించిన అభిమానుల సమావేశం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆదివారం చెన్నైలోని పోరూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివకార్తికేయన్ మాట్లాడుతూ.. తాను “పీపుల్ మేడ్ స్టార్” అని, అభిమానుల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. జీవితంలో ఏ రంగంలో ఉన్నా లక్ష్యంపై స్పష్టత ఉండాలని సూచించారు. విమర్శలు చేసేవారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారని, వాటిని పట్టించుకోకుండా ప్రేమతో, ఐక్యంగా ముందుకు సాగాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
సమావేశానికి వచ్చిన విద్యార్థులతోనూ శివకార్తికేయన్ మాట్లాడారు. బాగా చదువుకోవాలని, మంచి స్థాయికి ఎదిగి సంపాదించాలని, కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎక్కువగా చదివితే ఆలోచనా విధానం మరింత మెరుగవుతుందని, తద్వారా సోషల్ మీడియాపై ఆధారపడటం కూడా తగ్గుతుందని చెప్పారు. మరోవైపు తమిళనాడులో సినీ ప్రముఖుల అభిమానుల సమావేశాలు ప్రస్తుతం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ధనుష్, విశాల్ కూడా అభిమానులతో సమావేశమై ప్రజాసేవలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శక నటుడు రాఘవ లారెన్స్ ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ అభిమానుల సమావేశం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!