

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నేడు ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047’ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు దేశ–విదేశాలకు చెందిన ప్రముఖులు, పరిశ్రమల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొత్తం 44 దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు వచ్చారు.
సమ్మిట్ వేదిక వద్ద భద్రతను కట్టుదిట్టం చేయగా, మొదటి రోజు భవిష్యత్ సాంకేతిక రంగ మార్పులు, ఆర్థిక విధానాలు, అభివృద్ధి అవకాశాలు వంటి 12 కీలక అంశాల పై నిపుణుల చర్చలు జరిగాయి.
సదస్సుకు సుమారు 2,000 మంది అంతర్జాతీయ అతిథులు రాగా, వారి సౌకర్యాల కోసం ప్రభుత్వం ఆధునిక హంగులతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వంటకాలతో అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం కల్పించగా, ఫ్యూచర్ సిటీ మోడల్‌కు సంబంధించిన ప్రత్యేక వీడియో మరియు రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే స్పెషల్ సాంగ్ సమ్మిట్ ప్రారంభంలో విడుదలై ఆకట్టుకున్నాయి.
సమ్మిట్‌ను రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ప్రారంభించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ తల్లి’ డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పరిశ్రమల ప్రతినిధులు, నటుడు నాగార్జున కూడా హాజరయ్యారు. పలువురు ప్రముఖులు వేదిక పై ప్రసంగించి, ప్రపంచ సంస్థలను ఒకే వేదిక పైకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవను అభినందించారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని, తెలంగాణను క్యూర్, ఫ్యూర్, రేర్ అనే మూడు జోన్ల మోడల్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలు రాష్ట్రానికి ఆదర్శమని, 2047 నాటికి తెలంగాణను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న నమ్మకం వ్యక్తం చేశారు.
సమ్మిట్ తొలి రోజున పలు సంస్థలతో ముఖ్య పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి.
ట్రంప్ మీడియా టెక్నాలజీస్ వచ్చే పదేళ్లలో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలోని వంతారా ఫ్యూచర్ సిటీలో జూ పార్క్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
విన్ గ్రూప్ ఇండస్ట్రీస్ రూ.27,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
AGIDC రూ.70,000 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చింది.
విద్యుత్ రంగంలో మొత్తం రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి.
అదానీ గ్రూప్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టినట్లు, త్వరలో మరింత విస్తరణ ఉంటుందని ప్రకటించింది.
రెండో రోజు మరిన్ని కంపెనీలు పెట్టుబడి ఒప్పందాలు చేసుకునే అవకాశముందని ప్రభుత్వం తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!