

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించింది. ఈ నిబంధనలు 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో అమల్లో ఉంటాయి. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుండగా, ఆ తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించిన వివరాల ప్రకారం, 4,372 పోలింగ్ కేంద్రాల పరిధిలో 36,351 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఆంక్షల సమయంలో అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!