

మహాత్మా గాంధీ మనవడు దివంగత కనూ గాంధీ కుటుంబానికి చెందిన అమెరికాలోని 30 ఎకరాల భూమి వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. దాదాపు 20 నెలల పాటు సాగిన న్యాయపోరాటం అనంతరం గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. వర్జీనియాలోని వారెన్ కౌంటీలో షెనాండో నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న ఈ భూమిని కనూ గాంధీ, ఆయన భార్య శివా గాంధీ 1987లో కొనుగోలు చేశారు. 2016లో కనూ గాంధీ మరణించగా, 2018లో శివా గాంధీ ఆయన పేరుతో పాటు తన పేరుపై చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రచారం కోసం తమ ఆస్తులను దానికి బదిలీ చేశారు.
ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. వర్జీనియాకు చెందిన గ్రెగరీ బ్లాక్ అనే వ్యక్తి, అక్కడి అడ్వర్స్ పొసెషన్ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఆ భూమిపై తనకు హక్కు ఉందని వాదించాడు. ఈ చట్టం ప్రకారం నిర్దిష్ట నిబంధనలతో 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఒక భూమిని స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తి యాజమాన్య హక్కును కోరవచ్చు. అయితే ట్రస్ట్ ప్రతినిధి పరిమళ్ దేశాయ్ న్యాయవాదుల సహకారంతో పాటు GIS మ్యాపులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి ఆ వాదనను సవాలు చేశారు. సదరు వ్యక్తి నిర్మించానని చెప్పిన కేబిన్ 15 ఏళ్లుగా అక్కడ లేదని ఆధారాలతో నిరూపించినట్లు సమాచారం. వాదనలు పరిశీలించిన కోర్టు అతడి క్లెయిమ్‌ను తోసిపుచ్చి, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించింది. దీంతో 30 ఎకరాల భూమిపై ట్రస్ట్‌కు హక్కు దక్కింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!