

జవహర్ నగర్ డంప్ యార్డును తొలగించి బాధిత ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన ‘జన సంకల్ప యాత్ర’ మూడో రోజు కొనసాగింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీసర, చీర్యాల, బండ్లగూడ, నాగారం ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు డంప్ యార్డు కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాయకులకు వివరించి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. డంప్ యార్డును తొలగించేందుకు అయ్యే ఖర్చును అంచనా వేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈటల రాజేందర్ కోరారు. అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యతను బీజేపీ ఎంపీలుగా తాము తీసుకుంటామని తెలిపారు.
డంప్ యార్డు పరిసర ప్రాంతాల్లో పిల్లలు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని, ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మల్కాజిగిరి ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని విమర్శించారు. డంప్ యార్డు ప్రభావిత కుటుంబాల కష్టాలను కాంగ్రెస్ నాయకులు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సవాల్ విసిరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మరుసటి రోజు నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!