

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు, అవసరమైన విధానపరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఢిల్లీలో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులకు తాను సంరక్షకుడిగా ఉంటానని, విధానపరమైన మద్దతు అవసరమైతే వ్యక్తిగతంగా హామీ ఇస్తానని తెలిపారు. వ్యాపార రంగంలో పారిశ్రామికవేత్తల అనుభవాన్ని గౌరవిస్తూ, వారి సూచనలను స్వీకరించి ఆచరణలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. వారు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధించేలా తెలంగాణలో అనుకూల వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరుకావడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె మార్గాలు తెలంగాణకు ప్రయోజనం చేకూర్చనున్నాయని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రస్తావించారు. హైదరాబాద్ నుంచి ప్రపంచస్థాయి నాయకులు ఎదిగారని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ మాజీ సీఈవో శాంతను నారాయణ్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. గ్లోబల్ సమిట్‌కు వచ్చే పారిశ్రామికవేత్తలకు తెలంగాణ సంస్కృతి, కాకతీయ వారసత్వం, బతుకమ్మ సంప్రదాయాలను పరిచయం చేయనున్నట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!