

టీమిండియా టీ20 మాజీ కెప్టెన్, 2026 టీ20 ప్రపంచకప్ విజేత సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వరుసగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. న్యూఢిల్లీలో భార్య దేవిశా శెట్టి, కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిసిన సూర్యకుమార్, ఆ తర్వాత అమిత్ షాతోనూ సమావేశమయ్యారు. ఈ భేటీలకు సంబంధించిన ఫొటోలను సూర్యకుమార్‌తో పాటు మోదీ, అమిత్ షా కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు సూర్యకుమార్ బీజేపీలో చేరతారా? లేక ఆయన భార్య దేవిశా శెట్టికి పార్టీ టికెట్ ఇస్తారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఉత్తరప్రదేశ్‌లో యాదవ ఓటు బ్యాంకుపై బీజేపీ దృష్టి పెట్టిందనే ప్రచారంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రంలో యాదవులు సుమారు 10 నుంచి 11 శాతం ఉన్నారని, సంప్రదాయంగా అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని కథనం పేర్కొంది. సూర్యకుమార్ కుటుంబ మూలాలు ఘాజీపూర్ జిల్లాలోని సైద్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హథౌడా గ్రామంలో ఉన్నాయి. ఆయన తండ్రి అశోక్ కుమార్ యాదవ్ బార్క్‌లో ఇంజనీర్‌గా పనిచేసినట్లు సమాచారం. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చి గెలిపించిన విషయాన్ని కూడా ఈ ప్రచారంతో పోలుస్తున్నారు. అయితే, సూర్యకుమార్ లేదా దేవిశా రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ఇప్పటికైతే ఊహాగానాలుగానే ఉన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!