

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 26న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు రూ.450 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా మద్దిమడుగులోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణానికి, రూ.18 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు, రూ.38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం హెలికాప్టర్‌లో అచ్చంపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రి, హెలిప్యాడ్ నుంచి పాదయాత్రగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ రూ.274.32 కోట్లతో బీటీ రోడ్ల అభివృద్ధి, రూ.29.65 కోట్లతో నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు, రూ.25 కోట్లతో అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులు, రూ.18.105 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.16 కోట్లతో నీటి సరఫరా మౌలిక సదుపాయాలు, రూ.14 కోట్లతో మన్ననూరులో నూతన ఐటీడీఏ భవనం, రూ.2 కోట్లతో అచ్చంపేటలో ఆదివాసీ భవనం నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్త చేయూత పెన్షన్ల పంపిణీని ప్రారంభించి, అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!