

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్న అమెరికాలో ఇప్పుడు టెక్నాలజీ వైఫల్యాలపై ఆందోళన పెరుగుతోంది. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న సాంకేతిక అంతరాయాలతో ఎప్పుడైనా నిత్యావసర సేవలు నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోవచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తగా అత్యవసర సరుకులను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. టాయిలెట్ పేపర్లు, జనరేటర్లు, ఫ్రీజ్-డ్రైడ్ ఆహార పదార్థాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఫ్రీజ్-డ్రైడ్ ఆహార పదార్థాల ధరలు గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో 12 శాతం పెరిగాయి. టాయిలెట్ పేపర్ల ధరలు సెప్టెంబరు నుంచి 4 శాతం అధికమయ్యాయి. పేపర్ టవల్స్, బ్యాటరీలు, చెత్త సంచుల ధరలు కూడా పెరిగినట్లు సమాచారం. గతంలో అందుబాటులో ఉన్న కొన్ని అత్యవసర ఉత్పత్తులు ఇప్పుడు స్టాక్ లేకుండా పోతున్నాయి.
క్రిస్మస్ పండుగకు ముందు బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే వంటి భారీ డిస్కౌంట్ల సీజన్ సమీపిస్తుండటంతో సరుకుల కొరత ఏర్పడవచ్చన్న అంచనాలు కొనుగోళ్లను మరింత పెంచుతున్నాయి. ప్రొపేన్, బాటిల్డ్ వాటర్, క్యాంపింగ్ పరికరాలు, బియ్యం, క్యాన్లలో నిల్వ చేసిన ఆహార పదార్థాలకు డిమాండ్ పెరిగినట్లు వాల్‌మార్ట్, కాస్ట్‌కో వంటి రిటైల్ సంస్థలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టులు కూడా వినియోగదారుల ఆందోళనలకు కారణమవుతున్నాయి. గతంలో విమాన రవాణా, బ్యాంకింగ్ సేవలు, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కమ్యూనికేషన్లు సైతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ భయాలు మరింత పెరుగుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!