

షేక్ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని చట్ట ప్రకారం పరిశీలిస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం వెల్లడించింది. హసీనా స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లాలన్న ప్రకటనకు, బంగ్లాదేశ్ చేసిన అప్పగింత విజ్ఞప్తికి సంబంధం లేదని పేర్కొంది. మరోవైపు, భారత్‌తో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ప్రకారమే హసీనాను దౌత్య మార్గాల్లో స్వదేశానికి తీసుకురావాలని భావిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. అవామీ లీగ్‌ను తిరిగి దేశంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనివ్వబోమని స్పష్టం చేసింది. ఆ పార్టీని ఫాసిస్టు, మాఫియా ముఠాగా అభివర్ణిస్తూ, 2024లో జరిగిన సామూహిక హత్యాకాండకు బాధ్యత వహించాలని ఆరోపించింది. హసీనాతో పాటు అవామీ లీగ్‌కు చెందిన ఇతర నేతలను కూడా స్వదేశానికి తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని బంగ్లాదేశ్ హోం మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ వెల్లడించారు.
వచ్చే నెల 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని హసీనా ప్రకటించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. సరిహద్దు భద్రతా దళమైన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కి చెందిన 108 బృందాలను ఏడు జిల్లాల్లో మోహరిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో 56 బృందాలను హసీనా స్వస్థలమైన గోపాల్‌గంజ్ జిల్లాలోనే నియమించనున్నారు. ఒక్కో బృందంలో 30 నుంచి 40 మంది సిబ్బంది ఉంటారు. హసీనా తిరిగి వస్తే ఆమె మద్దతుదారులు హింసకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఆమె రాక నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!