

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను గుర్తించలేదని, పేర్ల మార్పు సమస్యను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల సంక్షేమంపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించిన ఆయన, కారుణ్య నియామకాలపై రాజకీయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో మొత్తం 3,189 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ఇందులో 2,437 కారుణ్య నియామకాలు, 752 ఎక్స్‌టర్నల్ నియామకాలు ఉన్నాయని వివరించారు.
సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. సింగరేణి కార్మికులకు రూ.1.2 కోట్ల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, ఈ సదుపాయం కోల్ ఇండియా ఉద్యోగులకు లేదని ఆయన పేర్కొన్నారు. పదేళ్లపాటు బీజేపీతో సన్నిహితంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గనులను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తగిన సహకారం అందకపోయినా కొత్త బ్లాక్‌లను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!