

శ్రీకృష్ణుడి బాల్యలీలల్లో గోవర్ధనోద్ధారణకు ప్రత్యేక స్థానం ఉంది. పురాణాల ప్రకారం, ద్వాపర యుగంలో గోకుల ప్రజలు వర్షాలు సమృద్ధిగా కురవాలని ఇంద్రుడికి యాగాలు నిర్వహించేవారు. అయితే ఇంద్రుడు తనను అందరూ పూజించాలనే గర్వంతో వ్యవహరించడాన్ని గమనించిన శ్రీకృష్ణుడు, ప్రజలకు ప్రకృతి, పశువులు, పంటలకు ఆధారమైన గోవర్ధన పర్వతం ప్రాముఖ్యతను వివరించాడు. దీంతో గోకుల వాసులు ఇంద్రయాగాన్ని నిలిపివేసి గోవర్ధన పర్వతానికి పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఆగ్రహంతో ఏడు పగళ్లు, ఏడు రాత్రులు గోకులంపై భారీ వర్షాలు, రాళ్ల వర్షం కురిపించాడు. భయాందోళనకు గురైన గోకుల ప్రజలను రక్షించేందుకు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, గోపాలకులు, గోవులు, దూడలకు ఆశ్రయం కల్పించాడు. దీంతో గోకుల వాసులంతా ఏడు రోజుల పాటు పర్వతం కింద సురక్షితంగా ఉన్నారు. శ్రీకృష్ణుడి ఈ లీలతో ఇంద్రుడి గర్వం తొలగిపోయింది. తన తప్పును తెలుసుకున్న ఇంద్రుడు శ్రీకృష్ణుడిని శరణు వేడగా, కరుణామయుడైన స్వామి అతడిని క్షమించాడు. గోవులను, గోకుల ప్రజలను కాపాడినందుకు కృతజ్ఞతగా భక్తులు శ్రీకృష్ణుడిని గోవిందుడిగా కీర్తించడం ప్రారంభించారని పురాణ గాథలు చెబుతున్నాయి.
గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తి గోకుల ప్రజలను రక్షించిన సంఘటనకు గుర్తుగా కార్తిక శుద్ధ పాడ్యమి రోజున గోవర్ధన పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పూజను అన్నకూట్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి, వివిధ రకాల పిండివంటలు, అన్నపదార్థాలు, మధుర వంటకాలను తయారు చేసి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా 56 రకాల భోగాలతో కూడిన 'చప్పన్ భోగ్' సమర్పించడం ఈ వేడుకలో ప్రత్యేకత. కొన్ని ప్రాంతాల్లో ఆవు పేడతో గోవర్ధన పర్వతం, శ్రీకృష్ణుడి ప్రతిరూపాలను రూపొందించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. గోపాష్టమి కూడా ఈ సంప్రదాయంతో ముడిపడి ఉంది. గోవర్ధన పూజ ద్వారా ప్రకృతి, పశుసంపద, వ్యవసాయం ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే పాడిపంటలు, ధనధాన్యాలు సమృద్ధిగా లభించి కుటుంబాల్లో సుఖసంతోషాలు నెలకొంటాయని భక్తుల విశ్వాసం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!