

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా పరిణామాలను జెలెన్‌స్కీ వివరించినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని మోదీ స్పష్టం చేశారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలన్న భారత వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, ఉక్రెయిన్ మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలు త్వరలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంభాషణకు ప్రాధాన్యం ఏర్పడింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మధ్యవర్తిత్వంలో ఈ నెల 10, 11 తేదీల్లో అబుధాబిలో చర్చలు జరగనున్నట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ గతంలో ప్రకటించారు. మరోవైపు, యుద్ధాన్ని ముగించేందుకు ఇదే సరైన సమయమని మోదీ ఇప్పటికే పలుమార్లు చెప్పారని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారని జెలెన్‌స్కీ తెలిపారు. మోదీతో జరిగిన ఫోన్ సంభాషణపై ఆయన ‘ఎక్స్’లో స్పందించారు. నల్ల సముద్రం మీదుగా ధాన్యం ఎగుమతులను రష్యా అడ్డుకోవడంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఆహార రవాణా మార్గాల ఏర్పాటులో భారత్ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉందని, సముద్ర మార్గాల దిగ్బంధనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు కోట్లాది మందిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!