

కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి భూమి రిజిస్ట్రేషన్లు చేసిన కేసులో ఏడీఆర్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సీహెచ్. దామోదర్‌రావుతోపాటు ముగ్గురు రిజిస్ట్రేషన్ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. మేడ్చల్-మల్కాజిగిరి సబ్‌రిజిస్ట్రార్ పి. శ్రీను, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్లు వి. అశోక్, పి. మధుబాబులకు కూడా ఈ శిక్ష ఖరారు చేసింది. బాచుపల్లిలోని సర్వే నంబర్ 140లో ఉన్న 17.10 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో 2023 ఫిబ్రవరిలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ గుడివాడకు చెందిన చలసాని కల్యాణి లీల కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించింది.
విచారణ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్న విషయం తమకు తెలియదన్న రిజిస్ట్రార్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని తెలిసినా ఏడీఆర్ ఎస్టేట్స్ సమర్పించిన పత్రాల ఆధారంగా అధికారులు రిజిస్ట్రేషన్లు కొనసాగించారని, ఇది ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కరణేనని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ పత్రాల చట్టబద్ధతను పరిశీలించే అధికారం తమకు లేదన్న వాదనను కూడా అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సంస్థ ఎండీ, ముగ్గురు రిజిస్ట్రేషన్ అధికారులకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అయితే అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న స్టాంప్స్ శాఖ ఐజీ, జిల్లా రిజిస్ట్రార్‌లపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!