
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తి ఎదుట ఎవరూ నిలువలేరన్నారు. అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. సినిమా తారల ఫోన్లు సైతం విన్నారని తెలిపారు. జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కేడర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు జాతిపిత.. మీ జాతి ఏంటి?.. నీతి ఏంటి? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలపై నిప్పులు చెరిగారు. దోపిడీ చేసిన దొంగలు జాతిపిత ఎలా అవుతారు? అంటూ వారిని సీఎం రేవంత్ సూటిగా ప్రశ్నించారు. వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ నిర్మించుకున్న మీలాంటోళ్లని.. జాతిపిత అంటే.. ఆత్మహత్య చేసుకుని చావాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసినోళ్లు జాతిపిత అవుతారని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని నేలకు ముక్కు రాయండంటూ వారికి స్పష్టం చేశారు. రెండేళ్లే పూర్తయ్యాయి.. మరో 8 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిరంతర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌నే గెలిపించాలని ప్రజలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!