

లోక్సభలో తనను మాట్లాడకుండా నిరోధించడం సభ సంప్రదాయాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం నాడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగిందని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. అందుకే సభలో తీవ్రమైన ఆందోళనకు దారి తీసిందని చెప్పుకొచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగంలో జాతీయ భద్రత ఒక కీలక భాగమని అన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.సభలో తన ప్రసంగాన్ని అడ్డుకోవడం ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను నిరాకరించడమే అవుతుందని రాహుల్ చెప్పారు. పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా.. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నేత మాట్లాడకుండా ప్రభుత్వం ఆదేశాల మేరకు అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికి మచ్చ అని అభివర్ణించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాను నిరసన తెలియజేస్తున్నానని స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ కుండబద్దలు కొట్టారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!