

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ (MCRHRD)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించాలంటే ఆదాయ సమీకరణపై అన్ని శాఖలు అత్యంత బాధ్యతతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీతో పాటు కమర్షియల్ ట్యాక్సులు, ఎక్సైజ్, మైనింగ్ తదితర శాఖల్లో ఆదాయ లీకేజీలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆదాయ సమీకరణ కోసం ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించి లబ్ధిదారుల వివరాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ)తో అనుసంధానం చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా వాస్తవిక బడ్జెట్ రూపొందించాలని, భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా శాఖల సామర్థ్యాన్ని పెంచాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!