

ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాకు మిత్రుడు కాదని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ స్పష్టం చేశారు. పుతిన్‌తో స్నేహపూర్వక సంబంధాలను ఆశించలేమని పేర్కొన్నారు. ఆదివారం ఏబీసీ న్యూస్ నిర్వహించిన ‘దిస్ వీక్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అంశంలో పుతిన్ అమెరికాకు మిత్రుడు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పారు. అయితే, ఇటీవల పుతిన్‌ను తన మిత్రుడిగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ర్యాట్‌క్లిఫ్ సమర్థించారు. ప్రపంచంలోని మూడు ప్రధాన అణ్వాయుధ శక్తులైన అమెరికా, రష్యా, చైనా దేశాధినేతల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పుతిన్‌ను మిత్రుడిగా పేర్కొనడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. గత వారం చైనాలో జరిగిన ఉన్నతస్థాయి శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు.
పుతిన్‌ను మిత్రుడిగా ఎందుకు అభివర్ణించారన్న ప్రశ్నకు గతంలో ట్రంప్ స్పందిస్తూ.. సుమారు 4,000 అణ్వాయుధాలు కలిగిన వ్యక్తితో శత్రుత్వం కంటే స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండటమే మంచిదని వ్యాఖ్యానించారు. కాగా, 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు ఐదో వంతు రష్యా నియంత్రణలో ఉంది. శాంతి ఒప్పందం కుదరాలంటే తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పుతిన్‌ను మిత్రుడిగా పేర్కొనడంపై ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న పలు యూరోపియన్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ సైతం స్పందిస్తూ.. ‘పుతిన్ మా మిత్రుడు కాదు.. ఎప్పటికీ కాలేడు’ అని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!