

గత 20 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఓ రైతు తన కుమార్తె వివాహాన్ని కూడా ప్రకృతి ఒడిలోనే నిర్వహించి ప్రత్యేకత చాటుకున్నారు. సంప్రదాయ ఫంక్షన్‌హాళ్లు, రసాయన ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉంటూ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో వివాహ వేడుకను జరిపించారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, ప్రకృతి వ్యవసాయదారుడు తుమ్మల సత్తిరెడ్డి తన కుమార్తె వీణ వివాహాన్ని మహారాష్ట్రకు చెందిన అజిత్‌తో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రమైన గోకులవనంలో పచ్చని చెట్ల మధ్య వివాహ వేడుకను ఏర్పాటు చేశారు. ప్రకృతికి అనుగుణంగా సాగిన ఈ పెళ్లి వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది.
వివాహానికి హాజరైన అతిథులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు గో ఆధారిత వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, గానుగ నూనె, దేశీ ఆవు నెయ్యితో 22 రకాల వంటకాలను సిద్ధం చేయించారు. వీలైనంత వరకు అవసరమైన వస్తువులను గ్రామంలోనే కొనుగోలు చేశారు. మరో విశేషమేమిటంటే.. వంటలను కూడా రైతులే స్వయంగా తయారు చేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనాథ్, తెలంగాణ గోశాలల సేవా సమితి అధ్యక్షుడు విజయరామ్, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ లక్ష్మీభాయి, ప్రకృతి వ్యవసాయదారుడు గాదె అశోక్‌రెడ్డి పర్యవేక్షణలో వంటలు సిద్ధమయ్యాయి. ప్రకృతి వ్యవసాయంపై తనకున్న నమ్మకాన్ని కుమార్తె వివాహం ద్వారా చాటిన సత్తిరెడ్డి, పర్యావరణ హిత వేడుకలకు ఆదర్శంగా నిలిచారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!