

రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో సాధించిన ఫలితాలను పోలుస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూగుల్ (రూ.1,33,000 కోట్లు), ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ (రూ.1,36,000 కోట్లు), బ్రూక్‌ఫీల్డ్ (రూ.1,06,000 కోట్లు), రిలయన్స్ (రూ.43,000 కోట్లు), రెన్యూ తదితర ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులతో ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. ‘కూటమి ప్రభుత్వ పెట్టుబడుల ట్రాక్ రికార్డు 2024-26’ పేరుతో వివిధ ప్రాంతాల్లో కంపెనీలు ప్రకటించిన పెట్టుబడుల వివరాలతో కూడిన గ్రాఫిక్‌ను కూడా పంచుకున్నారు.
మరోవైపు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని విమర్శిస్తూ ఖాళీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పక్కన బర్నాల్ ఆయింట్‌మెంట్ ట్యూబ్ ఉన్న చిత్రాన్ని లోకేశ్ పోస్టు చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే, పెట్టుబడులు, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, జగన్ చర్చకు వస్తారా లేక బర్నాల్ పంపించమంటారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ పోస్టుకు ‘క్రెడిట్ చోర్ జగన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!