

ప్రకాశ్ రాజ్ వైరల్గా మారిన “కాక్రోచ్ జనతా పార్టీ” ఉద్యమానికి బహిరంగ మద్దతు తెలిపారు. ఈ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే చేసిన పోస్టును పంచుకుంటూ దేశ యువత “ఎదగాలి, ప్రతిఘటించాలి, తమ హక్కులను తిరిగి సాధించాలి” అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతను “కాక్రోచ్లు”తో పోల్చిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వ్యంగ్యరూపంలో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మీమ్స్, రీల్స్, రాజకీయ విమర్శలు, యువత సమస్యలపై చర్చలతో ఈ డిజిటల్ ఉద్యమం విస్తరించింది.
కాక్రోచ్ జనతా పార్టీ తమ ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధమైనదని, హింసారహితమని చెబుతూ నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, పరిపాలన వంటి అంశాలపై యువత అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. ప్రకాశ్ రాజ్ మద్దతు ఇవ్వడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నెలకొంది. యువత భావోద్వేగాలకు ఆయన అండగా నిలిచారని అభిమానులు ప్రశంసిస్తుండగా, విమర్శకులు మాత్రం దీనిని కేవలం సోషల్ మీడియా వ్యంగ్య ఉద్యమంగా అభివర్ణిస్తూ, బీజేపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నదని ఆరోపిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలపై ప్రకాశ్ రాజ్ గతంలోనూ పలుమార్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!