

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి కీలక ప్రకటన విడుదల చేశారు. విరాళాల లెక్కింపులో తనకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేస్తూ, ఈ వ్యవహారంపై లోతైన, నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని కోరారు. ట్రస్టులో ట్రస్టీ, ట్రెజరర్ పదవుల కోసం తాను ఎప్పుడూ ఎలాంటి లాబీయింగ్ చేయలేదని, శ్రీరాముడికి సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ట్రస్టు ఖాతాల పర్యవేక్షణ మాత్రమే తన బాధ్యతల్లో భాగమని, పుణె కార్యాలయానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్లు ప్రతి నెలా ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తారని ఆయన చెప్పారు. ట్రస్టు చెక్కులపై సంతకం చేసే అధికారమూ తనకు లేదని, చెక్కుబుక్ కూడా తన వద్ద లేదని వెల్లడించారు. హుండీ విరాళాల లెక్కింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రక్రియను స్థానిక ట్రస్టీలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రూపొందించిన ఎస్‌ఓపీ ప్రకారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలపై విశ్వాసం ఉంచాలని కోరుతూ, నిందితులు తప్పించుకోరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!