

ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ నోటీసులు జారీ చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం కామారెడ్డిలో మంత్రి సీతక్కతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో విస్తృత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, కాంగ్రెస్ నేతలు మాత్రమే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తనతో పాటు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, సురేశ్ షెట్కార్ల ఫోన్లను కూడా నిఘాలో పెట్టారని అన్నారు. చేసిన తప్పులపై దర్యాప్తు జరపడం రాజకీయ వేధింపులు కాదని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో గెలుపు కోసం ఫోన్ ట్యాపింగ్‌ను వినియోగించారంటూ ఆరోపించారు. నేరానికి పాల్పడ్డ ఎవరైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.237 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. కేంద్రం నుంచి నిలిచిపోయిన నిధులు కూడా వారం రోజుల్లో విడుదల చేస్తామని సమాచారం అందిందన్నారు. సర్పంచులు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!