

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో బాధితులను కూడా తనిఖీ కమిటీల్లో భాగస్వాములను చేస్తే సమస్యలకు త్వరగా పరిష్కారం దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. కొన్ని పరిశ్రమలు లాభాల కోసమే నిబంధనలు ఉల్లంఘిస్తూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, జనావాసాల సమీపంలో పేలుళ్లు నిర్వహిస్తున్న మైనింగ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గోస్తనీ కాలువలో తీవ్ర కాలుష్యం నెలకొన్నదని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వేండ్ర గ్రామంలో సేకరించిన నీటి నమూనాల్లో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితికి ఐదు రెట్లు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. పరిశ్రమలు అక్రమంగా వ్యర్థాలను నదుల్లో విడుదల చేస్తున్నట్లయితే డ్రోన్లు, వీడియో కెమెరాలతో ఆధారాలు సేకరించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ తాగునీటి నాణ్యత మెరుగుపర్చేందుకు ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఆదేశించారు. ఫ్లోరైడ్, ఆర్సెనిక్ ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలని, పెండింగ్లో ఉన్న జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!