

మోదీ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఆ సమావేశాలకు ఐదారు రోజుల ముందు అంటే ఈ నెల 25 లేదా 26న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రోరోగ్ కాకపోవడంతో ఈ నెలాఖరులో జరిగే సమావేశాలు వర్షాకాల సమావేశాలుగానే కొనసాగుతాయని... ప్రత్యేకంగా శీతాకాల సమావేశాలు ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 30 నుంచి డిసెంబర్ 18 వరకు పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని అంటున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదింపచేసేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసుకుంటోంది. వివిధ పార్టీలతో బీజేపీ సీనియర్లు అంతరంగిక చర్చలు ఇప్పటికే పూర్తిచేసినట్టు సమాచారం. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతోపాటు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) కూడా నియోజకవర్గాల పెంపునకు సుముఖంగా ఉన్నాయని.. డీఎంకే కూడా కొన్ని షరతులతో సుముఖత వ్యక్తం చేసిందని చెబుతున్నారు.
ఈసారి మంత్రివర్గంలో భారీగానే మార్పులు చేయాలని మోదీ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. 12 నుంచి 17 మంది కొత్తవారిని తీసుకోవాలని, కొందరు సీనియర్లను తప్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ చౌహాన్, నిర్మల, మనోహర్‌లాల్, ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి తదితరులు ఒకటి కంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్నారు. ఆ అదనపు శాఖలను కొత్తవారికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!